Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

క్షంతవ్యులు

By భీమేశ్వర చల్లా (Bhimeswara Challa)

Click here to view

Book Id: WPLBN0100302562
Format Type: PDF eBook:
File Size: 0.1 MB
Reproduction Date:

Title: క్షంతవ్యులు  
Author: భీమేశ్వర చల్లా (Bhimeswara Challa)
Volume:
Language: Telugu
Subject: Fiction, Drama and Literature, తెలుగు సాహిత్యం, నవల, ఫిక్షన్, స్త్రీపురుషసంభందం, స్త్రీపురుషాకర్షణ, ప్రేమ, కమింగ్ అఫ్ ఏజ్,, ఫెమినిజం,రొమాన్సు, అనుబంధాలు, Telugu novel, Telugu fiction, Telugu women's writing, Telugu love storry
Collections: Authors Community
Historic
Publication Date:
Publisher: SelfImprint
Member Page: Bhimeswara Challa

Citation

APA MLA Chicago

చల్లా (Bhimeswara Challa) బి యస్ మూర్తి (Bs Murthy)Itor, B. భ. (Ed.). (n.d.). క్షంతవ్యులు. Retrieved from http://gutenberg.cc/


Description
తొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయోక్తి కాదు. ఈ 1956 నవల నేటి భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది. చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు. కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు. చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు. ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది. ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే స్త్రీ వాది సరళ, కర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు. మరొకవైపు యశో రామం సేవా సాంగత్యాలే తన ఆచలిత జీవన ధ్యేయం అని నిర్ధారించుకొని శరత్ సాహితీ అనుభూతితో అతనిపై వెదజల్లిన ప్రేమానురాగాలు నిశ్చల ప్రేమకు నీరాజనాలు. అనూహ్య స్త్రీపురుష ద్వందానుబంధాలు ఈ 'క్షంతవ్యులు' సారాంశం ఈ - కమింగ్ అఫ్ ఏజ్ - పుస్తకం నవలా రచనకి అద్వితీయ నిదర్శనం.

Summary
'క్షంతవ్యులు' అనూహ్య స్త్రీపురుష ద్వందానుబంధాలఈ' సారాంశం ఈ - కమింగ్ అఫ్ ఏజ్ - పుస్తకం నవలా రచనకి అద్వితీయ నిదర్శనం.

Excerpt
చాప్టర్ 1 ‘జీవితంలో ఏంచేసినా నువ్వు కథలు రాయవద్దు రామం’’ అని కాలేజీలో తెలుగు మాస్టారు చెప్పినట్లు జ్ఞాపకం. ఆయన పండితులు. చాలా ఉద్గ్రంథాలు పఠించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు. హరి కథలు కూడా చెప్పినట్లు గుర్తు. అందుచేత ఆయన చెప్పినది నిజమే అయివుంటుంది. అప్పుడు నేను ఆ మాటలను అట్టే పట్టించుకోలేదు. శ్రేయోభిలాషి చెప్పిన సలహా అని, భావించాను. ఈనాడు నేను ఆయన సలహాను ఉల్లంఘిస్తున్నానేమోనని భయంగా ఉంది. అయినా, నేను రాసేది కట్టుకథా కాదు, నవలా కాదు. అయితే ఏమిటది? సరైన సమాధానం నేను చెప్పలేను. కల్పన లేకుండా కథ ఉండదు. కథ లేకుండా నవల ఉండదు. ఇందులో రెండూ లేవు. ఇందులో యథార్థానికి (వాస్తవానికి) దూరములో ఉన్న విషయాలు చాలా తక్కువ. గత జీవితాన్ని పర్యావలోకనం చేసుకోవాలనే వాంఛ ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. జీవిత సంధ్యాసమయంలోని వేకువఝామున ఇది మరీ ప్రబలంగా ఉంటుంది. ఈ భూమి మీద ఇంతకాలం బ్రతికాను. నేను సాధించినదేమిటి? ఎంతమందిని దు.ఖపెట్టాను? ఎంతమందిని సుఖపెట్టాను? ఇలాంటి ప్రశ్నలు మనస్సులో మెరుపులా మెరుస్తూ ఉంటాయి. అదే కోరిక నాకు ఈనాడు కలిగింది. అయినా ఎంతో సంశయంతో, ఎంతో అనుమానంతో ఈ ప్రశ్నకి సమాధానం వెదకడం మొదలుపెట్టాను. నా జీవితమంతా వ్యర్ధంగానే గడచిపోయింది. ఆశయంలేని జీవితానికి గమ్యస్థానం కూడా తెలియదు. పుట్టినప్పటి నుంచి, ఇప్పటివరకూ నేనొక దమ్మిడీ కష్టపడి సంపాదించలేదు. చెమటకార్చి నేనెవరినీ పోషించలేదు. చాలా కాలం ఒక స్త్రీ ధనం మీద నేను బతికాను. అది చాలా ‘హీనమైన పని’ అని చాలా మంది అంటారు. ఎందుచేత? పురుషుని ధనం మీదే స్త్రీ ఎందుకు బతకాలి? స్త్రీ ధనం మీద పురుషుడు ఎందుకు బతకకూడదు? ఈ ప్రశ్నలకి సమాధానం నేనెంత ఆలోచించినా నాకు దొరకలేదు. అయినా పురుషుడు స్త్రీ ధనం మీద బతకడం హీనమైనది కాకపోయినా, వాంఛనీయమైనది మాత్రం కాదు. అందరూ ఎవరి దేహాన్ని వారే పోషించుకోవాలి, స్త్రీ అయినా, పురుషుడైనా ఇతరుల మీద ఆధారపడటం వివేకవంతమైనది కాదు. అదిసరే, ‘గతాన్ని గురించి దు.ఖించి లాభమేమిటి?’ అని నిటూర్పు విడిచాను, జీవితంలోని వెన్నెలంతా తెలుగుదేశం బయటే గడిపేశాను. అందులో సగభాగం మంత్రముగ్ధునివలె ఒక స్త్రీ వెంట తిరిగాను. ఈనాడు కూడా నాకు ఆశయం లేదు. నివృత్త జీవితం నుంచి నిష్కృతిని నిరీక్షిస్తున్నాను. కాని ఆ రోజులు వేరు. నా సర్వస్వమూ ఆమె గుప్పిటిలో ఇమిడి ఉండేది. ఇంత నిరర్ధకుడి భారం ఆమె ఎందుకు వహించింది? నా కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమెకు నా నుంచి తిరిగి లభించింది శూన్యం. అయినా జీవితపుటంచుల లాగే జీవితపు విలువలుకూడా మనకు తెలియవు. ఒక వ్యక్తి విలువ తక్కెడలో పెట్టి తూచగల శక్తి ఎవరికి ఉంది? ఒకరికి నిరర్ధక జీవిలా కనబడే వ్యక్తి మరొకరికి ప్రేమ పాత్రుడు, ఉత్తముడు గా కనిపిస్తాడు. సృష్టిలోని చిదంబర రహస్యమిదే. చిన్నతనం నుంచి నేనెవరో ఒకరి ఛాయల్లోనే మెదిలాను, ఎవరో ఒకరి రక్షణలోనే బ్రతికాను, బాల్యంలో తల్లి, చిరుయవ్వనంలో సుశీ ఆ తరువాత యశో.... ఈ ముగ్గురు స్త్రీలు నా వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చారు. కాని వీరి ముగ్గిరి కన్నా మిన్నగా ఇంకొకరి రూపం నా హృదయంలో హత్తుకుపోయింది. ఆమే లఖియా, పవిత్ర అనురాగం దాన్ని భూమిమీద నడిచే ఏ స్త్రీ కైనా జతచేయ దలచుకొందేమో నన్నట్లు వుందీమె. ఇక సరళ సంగతి, అందరిలోకి ఆమెకే నేను అన్యాయం చేశాననిపిస్తోంది. ఆమెను నేనుఈ నాటికి అర్ధం చేసుకోలేక పోయాను. హృదయాంతరాళంలో ఆమె నన్ను ఏ విధంగా భావించేదో నేను ఎన్నడూ తెలుసుకోలేక పోయాను. ఇక సుజాత, ఆమె కథ విన్నాను. కాని ఎప్పుడూ కలుసుకోలేదు. నల్లటి అందమైన యువతులు కనబడితే స్మృతిపథంలో తళుక్కున ఒక సారి మెరుస్తుంది. ప్రమీలను కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అయినా చివరకు నా జీవితవిధానాన్ని మార్చే ప్రయత్నంలో ఆమె ఎంతో తోడ్పడింది. ఇక మిగిలింది సురేఖ, అపరిచిత బాటసారులుగా వెళ్లి ఆమె ఆతిధ్యాన్ని ఆరాత్రి మేము స్వీకరించాము. ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె సాంగత్యము లభించింది. కోరిన ప్రియుడిని వివాహము చేసుకోగలిగింది. ఇంకోమాట, నవల రాయడం బొత్తిగా చేతకాదని ముందరే చెప్పాను. నేను రాసేది నవల కాదు, అని నన్ను నేను మభ్యపరుచుకొంటూ దీనిని మొదలుపెట్టాను. నవల దృష్టితో చూస్తే ఇందులో చాలా లోపాలుంటాయి. అయినా నిజం కల్పనకన్నా ఎప్పుడూ మంచిదనే నమ్మకంతో ముందుకు సాగిపోతాను. తెలుగు మాస్టారుని తలచుకొంటూ. నా ఎనిమిదవ ఏట నేను, నా తల్లిదండ్రులు మద్రాసు వెళ్లాం. అనేకమందిని కోల్పోయిన తర్వాత నేనే వారిద్దరికి మిగిలింది. అందుకని తల్లిదండ్రులకి నేనంటే పంచప్రాణాలు. ముఖ్యంగా మా అమ్మకి ఇక వేరేపని ఉండేదికాదు. మద్రాసులోనే రెండు సంవత్సరాలు వుండి పోయాము. ఎగ్మూరులోని మాయింటి పక్క ఓ ప్లీడరు గారు ఉండేవారు. ఆయన కూడా మాలాగే ఆంధ్రుడు. మా కుటుంబానికి ఆయన కుటుంబానికి చాలా దోస్తీ. ఆయన పదేళ్ల కూతురు సుశీల, నేను ఒకే క్లాసు చదివేవాళ్లం. నేను ఆ ఊరికి కొత్తకనుక నన్ను స్కూలుకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి తీసుకొచ్చే పూచీ మా నాన్నగారు సుశీ పెట్టదలచారు. మొదటి సారి నేను వాళ్లయింటికి వెళ్లినప్పుడు వాళ్ల నాన్న గారు నన్ను సుశీ దగ్గరకు తీసుకెళ్లి ‘‘సుశీ నీకు ఒక కొత్త స్నేహితుడు వచ్చాడు,’’ అంటూ పరిచయం చేశారు. సుశీ కొంచెము బొద్దుగా, నాకంటే బాగా పొట్టిగావుంది. (అప్పటి సుశీ ఫోటో ఇంకా నావద్ద వుంది) పరికిణీకట్టుకొని బుద్ధిగా కూర్చుని బయటికి పాఠాలు చదువుకొంటూవుంది. మేము లోపలికి వచ్చినవెంటనే లేచి నుంచుంది. తండ్రి చెప్పిన మాటలు విని నా ముఖం కేసి తదేకంగా చూసింది. నాకు అంతకుముందు ఆడపిల్లలతో స్నేహం లేదు. అక్క చెళ్లెళ్లు కూడా లేరు. స్త్రీ జాతినంతను మా అమ్మతో ఏకం చేసేవాడిని. ఇంకే ఇతర స్త్రీ ఏ అంతస్తులోనూ నావూహలోలేదు. పసివాడినైనా ఎందుకో ఆమె కళ్లు నాలోని సిగ్గుని బయటకి తెచ్చాయి. నాకంటే పొట్టిగావున్న ఆమె నాకంటె చాలా పెద్దదానిలా కనబడింది. ఏంచేయాలో అర్ధంకాలేదు. కళ్లు క్రిందికి దించేసుకుని ఆ గదిలోంచి బయటకు పారిపోదామని ఆలోచిస్తున్నాను. నా పరిస్థితి చూచి జాలికలిగిందని, ఒక విధమైన మాతృప్రేమ పెల్లుబికిందని సుశీ నాకు తర్వాత చెప్పింది. ఆటలు ఆడుకునే సమయంలో బొమ్మలికి తల్లిగా నటించినట్లే తన కళ్లలోకి చూడటానికి భయపడుతున్న ఆ అబ్బాయిని కూడా బుజ్జగించాలనే కోరిక కలిగిందట. ‘‘నీ పేరేంటి?’’ అంది నా దగ్గరకు వచ్చి నా కళ్లలోకి చూస్తూ... ఇంకా ఆ కళ్లలోకి చూడలేకపోయాను. “రామం,” అన్నాను నేలకేసిచూస్తూ. ‘‘నా పేరు సుశీ... సుశీల,’’ అంది నా చెయ్యి పట్టుకుంటూ. ‘‘సుశీ . రామం నీతో స్కూలుకి వస్తాడు జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురావాలి,’’ అన్నాడు సుశీ తండ్రి. సుశీ ఆయన మాటలను విన్నా, వాటికి సమాధానం చెప్పలేదు. నా చెయ్యి పట్టుకుని ‘‘నువ్వు నాకన్నా పెద్దవాడివా? చిన్నవాడివా?’’ అంది. ‘‘అది రామానికెలా తెలుస్తుంది. సుశీ . నీకెన్నేళ్లో చెప్పలేదు కదా నువ్వు?’’ అన్నారు ఆయన నవ్వుతూ. ‘‘నాకు పదేళ్లు,’’ అంది సుశీ, ఆమె చేతిలో నాచెయ్యి అలాగేవుంది. ‘‘నాకు ఎన్నేళ్లో నాకు తెలియదు. మా అమ్మ నాకు చెప్పలేదు,’’ అన్నాను నెమ్మదిగా నాచెయ్యి విడదీస్తూ. ‘‘నాకంటె పొడుగ్గా వున్నావు, నా కంటే పెద్దవాడివే అయి వుంటావు,’’ అంది నా దగ్గర అలాగే నుంచుని. ‘‘సరే ఇక పద రామం, మీ ఇంటికి వెళ్దాం, రేపు స్కూలుకు వెళ్లేముందు సుశీ మీ ఇంటికి వస్తుంది,’’ అన్నారు సుశీ నాన్నగారు. ఆయనతో నేను బయటికి వచ్చేశాను. సుశీ కూడా మా వెంట వచ్చింది. ఆ విధంగా నాటుకున్న విత్తనం క్రమక్రమంగా పెరిగి పెద్దదయింది. స్కూలుకి కలిసి వెళ్లేవాళ్లం. కలిసి తిరిగి వచ్చేవాళ్లం. స్కూలులో కూడా ఒకే క్లాసులో ఉండేవాళ్లం, పక్కపక్కన ఇళ్లు కనుక ఇతర సమయాల్లో కూడా కలిసే ఉండేవాళ్లం, మొదటి నుంచి సుశీ నామీద అధికారం చెలాయించేది. స్కూలులో తోటి పిల్లలవద్ద ఎప్పుడూ నన్ను వెనకేసుకుని వచ్చేది. ఏమైనా అల్లరిపని చేస్తే మాష్టారి కంటె ఎక్కువగా సుశే నన్ను మందలించేది. అది నాకేమంత కష్టమనిపించేది కాదు. స్వతంత్రంగా నేను ఎప్పుడూ జీవించలేదు. ఇంటి దగ్గర మా అమ్మ, బయట సుశీ వీరిద్దరూ నన్ను పరిపాలించేవారు. మేము ఒకరిని విడిచి ఒకరం ఒక్కరోజైనా ఉండలేదు. అసలు అలాంటి అవసరమే రాలేదు. ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి, ఇక మద్రాసుని, సుశీనీ వదలవలిసిన సమయం అసన్నమైంది. ఆ మాట విని సుశీ ఏడ్చింది. గోలచేసింది. కాని ఆ చిన్న పిల్లమాట వినేదెవరు? నేనూ ఏడ్చాను, కాని నా ఏడుపు మా నాన్న గారి పేకబెత్తంతో పటాపంచలైంది. మేము మాఊరు వచ్చేశాము. మొదట్లో కొన్నాళ్లు అస్తమానమూ సుశీ జ్ఞప్తికి వచ్చేది. తర్వాత సుశీని క్రమ క్రమంగా మరచిపోయాను. పద్ధెనిమిది సంవత్సరములయ్యే నాటికి సుశీ ఒక స్మృతిగా మిగిలిపోయింది. ఆమెది ‘అప్పటి’ ఫొటోని బయటికి తీసి అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. అవి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్సు చదివే రోజులు. నేను ఊరిలో ఒంటరిగా బస చేసేవాడిని. కాలేజీ తెరచిన రెండు నెలలకి ఒక అందమైన అమ్మాయి నా క్లాసులో చేరింది. ఆ రోజు సాయంత్రం నేను లాడ్జికి తిరిగి వస్తూవుంటే వెనుకనుంచి ఎవరో పిలుస్తన్నట్టయి వెనుదిరిగి చూశాను. ఆమే కొత్త అమ్మాయి, ఆగమని చేత్తో సంజ్ఙ చేసేంది. ‘‘క్షమించండి. నేను మీ క్లాసుమేట్ని, మీ ఫిజిక్సు నోట్సు ఓ సారి ఇవ్వగలరా?’’ అంది నా దగ్గరకు వచ్చి. నేనుఒక అపరిచిత కాలేజీ యువతితో మాట్లాడటం అదే మొదటిసారి. సుశీని వదలిన తర్వాత ఇంకెవరి సహవాసము నాకు లభించలేదు. ‘‘నా రైటింగ్ బావుండదండీ, ఇంకెవరినైనా అడగండి,’’ అన్నాను కాస్త తడబడుతూ. ‘‘ఫర్వాలేదు మీదే ఇవ్వండి,’’ అంది. “కానీ అది నావద్ద లేదండి,” అన్నాను ఎలాగైనా తప్పించుకుందామని. అయినా ఆమె నన్ను వదలలేదు, ‘‘మీతో మీ లాడ్జికి వస్తాను పదండి,’’ అంది. ముక్కూ మొగము తెలియని నాతో లాడ్జికి వస్తానన్న ఆమె మీద ఏహ్యాభావం కలిగిన మాట దాచటం అనవసరమనుకుంటాను. అయినా ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను, ‘అందులో తప్పేముంది? నలుగురు అలా అనుకుంటారని అర్థంలేకుండా నేనుకూడా అలా ఎందుకు భావించాను?’ ‘‘ఎందుకు మీకింత శ్రమ? నేను రేపు క్లాసుకి తీసుకొస్తాను వెళ్లండి,’’ అన్నాను. ‘‘మీతో కాస్త మాట్లాడాల్సిన పనివుందండి. మీరొక్కరేనా రూములో ఉంటున్నది?” అంది కాసేపు నన్ను పరిశీలనగా చూచి, “ఔనండి,” అన్నాను. “మీకభ్యంతరం లేకపోతే మీతో వస్తాను,” అంది. అభ్యంతరం వున్నా అడ్డు ఎలా చెప్తాను? నాతో రూముకు వచ్చింది. తీరికగా కూర్చుని, “మీ పేరు తెలుసుకోవచ్చాండీ?’’ అని అడిగింది, చెప్పాను. “మీ తండ్రిగారి పేరు?’’ అదీ చెప్పాను. ఊరి పేరు సైతం అడగ్గా అదీ చెప్పాను. ఇంతలో ఆమె దృష్టి గోడకు తగిలించివున్న సుశీ చిన్ననాటి ఫొటో మీద పడింది. నా కేసి చూసి తిరిగి ‘‘నేను ఎవరో గుర్తుపట్టలేదా రామం?’’ అంది. ఆమె సుశీ ఫోటోకేసి చూడటం, అలా అడగటాన్ని గ్రహించి ‘సుశీ’ అన్నాను. సుశీ కిలకిలా నవ్వి ‘రామం’ అంది. సుశీ స్వతహాగా అందగత్తె అని నాకు తెలుసు. కానీ ఇంత అందంగా తయారవుతుందని నేను ఊహించలేదు. స్త్రీలు యవ్వన ప్రవేశానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. సన్నగా, పొడుగ్గా, నాజూగ్గా ఉంది. అంతా మరిచిపోయి ఆమెకేసి తేరిపార చూస్తున్నాను. ‘‘అలా చూస్తావేంటి రామం? అపరిచిత వ్యక్తిలా?’’ అంది సిగ్గుతో కళ్లు క్రిందకు దించుకుని. ‘‘నువ్వే ఆ సుశీవంటే నమ్మలేకపోతున్నాను. చాలా మారిపోయావు,’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘మీరూ మారిపోయారు. అయినా క్లాసులో చూసినప్పుడే అనుమానం వేసింది. అందుకే మీ వెంట వచ్చాను,’’ అంది. చాప్టర్ 2 కొన్ని కొన్ని సంఘటనలు, ముఖ్యంగా మనమెన్నడూ ఆశించననవి, జీవిత కాలక్రమాన్నే మార్చేస్తాయి. తిన్నగా సాఫిగా సాగుతూన్న జీవితపు బాట వక్రమార్గాలు తొక్కుతుంది. దీనికి కారణం వెతకటం అవివేకమూ, అవాంఛనీయమూ కూడాను. లోకాన్ని చూసిన పెద్దలు క్రింద పెదిమ నొక్కిపెట్టి ‘విధిచేష్టలు’ అంటారు. ఏమో అయివుండవచ్చు, కానీ ఈ విధి, ఈనియంత, ఇంత పక్షపాతంగా ఎందుకు ఉంటాడా అని అసహ్యం వేస్తూవుంటుంది. ఎవరైనా సుఖపడుతూంటే ఇతగాడు ఓర్వలేడు. ఏమయితేనే, సుశీ సాంగత్యమూ, స్నేహమూ నాకు లభించాయి. ఎనిమిది సంవత్సరాల తర్వాత పసి యవ్వనంలో తిరిగి ఈమె నాకు దొరికింది. సంతోషించానని వేరే చెప్పాలా? ఆనందంగా, ఆహ్లాదంగా, కులాసాగా ఆ సంవత్సరము గడిపేశాము. క్లాసులో సుశీకి ఎప్పుడూ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. సుశీ కొంటెగా ‘‘నన్ను చూసి మార్కులు వేస్తున్నారు, జర్మన్ ప్రొఫెసర్ కి నేనంటే చాలా ఇష్టం తెలుసా’’ అంది. ఓసారి క్లాసులో జర్మన్ ప్రొఫెసర్ బ్లాకు బోర్డు మీద ‘ఇష్ లీజర్ జీ మేర్’ అని జర్మన్ లో రాసి, సుశీని ఇంగ్లీషులోకి తర్జుమా చేయమన్నాడు. అంటే దాని అర్ధం, ‘నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని, సుశీ నిస్సందేహంగా తర్జుమాచేసింది. క్లాసు అయిపోయింది. తర్వాత “ఈ రాత్రి ప్రొఫెసర్ నిద్రపోడు, బట్టతల గోక్కుంటూ కూర్చుంటాడు,” అంది. రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను శరవేగంతో మారిపోతున్నాయి. సాయం సమయాల్లో సుముద్రతీరానికి వెళ్లేవాళ్లం. విరామరహితంగా విరుచుకుపడే కెరటాలను చూస్తూ చీకటిపడేదాక ఉండిపొయే వాళ్లం. ఒక రోజు సాయంకాలం లాజన్సేబేవద్ద ఇసుకలో కూర్చొని ఉన్నాము. ఎందుచేతో సుశీ ఆ రోజు పరధ్యాన్నంగా ఉన్నట్లు కనబడింది. చీకటి పడిపోయింది. కాని లేచి రూముకు పోవాలనిపించడం లేదు. సుశీకూడ లేచే ప్రయత్నం చేయలేదు. ‘‘ఇసుకలో ఏమని రాశానో చెప్పుకో,’’ అన్నాను. నా పక్కనే ఉన్న సుశీ ముఖకవళికలు స్పష్టంగా కనబడటంలేదు. కాని పెదిములు విడచుకుని తెల్లటి రెండు పళ్ల వరుసలు కనబడ్డాయి. బుగ్గలమీద రెండు గుంటలు పడ్డాయని ఊహించుకున్నాను. ఎందుకంటే చిరునవ్వుకి వాటికి ఏదో అవినాభావ సంబంధము ఉందని నాకు తెలుసు. ‘‘ఇంకేమి రాస్తావు? నీవు ఎప్పుడూ ఆలోచించే ఆ ఒక్కటేగా,” అంది. ‘‘తప్పు చెప్పావు, సుశీల అని రాయలేదు. సుశీ అని రాశాను,’’ అన్నాను. “రెండింటికి తేడాయేమిటో?” అంది. ‘‘సుశీల నా క్లాసుమేటు, సుశీ నా బాల్య స్నేహితురాలు, ఫిజిక్సునోట్స్ తోపాటు తిరిగి నేను ఆమెకు దొరికాను,’’ అన్నాను. ‘‘అవును, ఇంతకీ నువ్వు నాకు నీ ఫిజిక్సు నోట్సుఇవ్వనేలేదు రామం. ఆనాడు మరచిపోయాను,’’ అంది. ‘‘దాంతో ఇక అవసరమేముంది సుశీ, అది నీకు వంక మాత్రమే కదా,’’ అన్నాను. ‘‘నన్ను గురించి నువ్వేమనుకున్నావు? ‘మీ రూముకు తీసుకెళ్లమంటె’ నువ్వేమని భావించావు,’’ అంది. ‘‘చాలా ఆశ్చర్యపోయాను, ఒక అపరిచిత యువతి అలాంటి పని చేస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆ సుందరాంగి సుశీ అనే అనుమానమే నాకు కలుగలేదు,’’ అన్నాను. ‘‘అవును; అదే స్త్రీ పురుషులకున్నతేడా, పురుషుని జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. కాని స్త్రీకి అదే సర్వస్వము. జీవిత కాలంలోని అనుక్షణము అందుకే అర్పిస్తుంది. స్త్రీ హృదయాన్ని అలా ఎందుకు సృష్టించాడో నాకు తెలియదు. బహుశా సృష్టికర్తకి కూడా స్త్రీ అంటే చిన్న చూపేయేమో. ఎందుకంటె దానివలన స్త్రీకి లభించేది దు.ఖం మాత్రమే,’’ అంది. సుశీ మాటల్లోని సత్యాన్ని ఇప్పుడు గ్రహించినంత సుస్పష్టంగా నేను అప్పుడు గ్రహించలేదు. నాకు అది నిరూపించవలసిన దౌర్భాగ్య స్థితి కలిగింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె మాటలకంటే ఆమె కంఠస్వరం నన్ను వ్యాకులపరచింది. ఆ విధంగా ఆమె ఎప్పుడూ అంతకుముందు మాట్లాడలేదు. సీరియస్గా దేని గురించి సుశీ మాట్లాడేది కాదు. అలాంటి చిన్న విషయాలను గురించి చింతించటం ఆమె స్వభావానికే విరుద్ధం. నేను అన్నమాటలు ఆమె హృదయాన్ని గాయపరిచాయని గ్రహించాను. అనాలోచితంగా అపరిచిత యువతి అన్నాను – చిన్ననాటి సుశీని చాలావరకు మరచిపోయిన మాట నిజమే. చీకటి నలుమూలలా దట్టంగా వ్యాపించింది. కనుచూపు మేరలో ఉన్న సముద్ర తీరమంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. నురుగలు కక్కుకుంటూ సముద్రం భీకరంగా ఉంది. దూరాన వున్న ఓడలోని దీపాలు, ద్వీపంలోని భవనపు దీపాన్ని జ్ఞాప్తికి తెస్తున్నాయి. మలుపు తిరుగుతున్న కారులైటు కాంతి మా ఇద్దరిమీద ఒక సారి పడింది. ‘‘చాలా ఆలస్యమయినట్టుంది... సుశీ ఇక పోదామా ...’’ అన్నాను. ‘‘అప్పుడేవద్దు. రేపు ఆదివారం కదా? ఇంకా కాసేపు కూర్చుందాము,’’ అంది. నేను ఇంకేమీ మాట్లాడలేదు. రూముకు పోవాలనే తొందర నాకూ లేదు. కొన్ని నిమిషాలు గడిచిపోయాయి. నిద్రిస్తున్న నిశ్వబ్దాన్ని భంగపరుస్తూ సముద్రం ఘోషపెడుతూంది. ఎవరో ఒక జంట మా ముందు నడిచి వెళ్లేరు. సముద్రానికి ప్రేమికులకు యుగయుగాల నుంచీ సంబంధముంది. సాగర గర్భంలో ఎంత మంది ప్రేమికులు ఇమిడి ఉండలేదు. సముద్రం మీద ఏకాంత యాత్ర ఎంత మధురంగా ఉంటుంది. సముద్ర తీరం ప్రేమ కలాపాలకి ఎంత అనువైన స్థలం! ‘‘చదువైపోయిన తర్వాత నువ్వేం చేస్తావు, ’’ అంది సుశీ హఠాత్తుగా. ‘‘ఏం చేస్తాను సుశీ . అందరూ చేసేదే నేనూ చేస్తాను, ఏదో ఒక ఉద్యోగం దొరకక పోతుందంటావా?’’ అన్నాను. “నువ్వు ఉద్యోగం చేస్తావా? అయితే చూడాలని ఉంది. కాని అది నీకు సరిపడదు,’’ అంది సన్నగా నవ్వుతూ. ‘‘ఉద్యోగం చేయక ఇంకేమిచేస్తాను సుశీ? హోటలు పెట్టమంటావా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘అదికాదు, నువ్వు బహుశా కవివి అవుతా వేమో . లేకపోతే రచయిత అవుతావు . చిన్నతనంలో నువ్వు పాడుకధలు చెప్పి అందరినీ భయపెట్టే వాడివికాదా,’’ అంది. ‘‘లేదు సుశీ! అదేమీ సులభం కాదు. కవి కావాలన్నా, కవిత్వం రాయాలన్నా సత్యాన్ని అసత్యం నుంచీ, సంభవాన్ని అసంభవము నుంచీ, శుచిత్వాన్ని కల్మషం నుంచీ, విడదీసి విశదీకరించ గలిగే ఆత్మ పరిశోధనా శక్తి కావాలి. విజ్ఞానం అనుభవంగానూ, అనుభవం విజ్ఞానంగానూ, రెప్పపాటు కాలంలో మార్చగలిగే శక్తి కావాలి. బాహ్యనేత్రానికి కనబడని దానిని మనో నేత్రంతో పరిశోధించ గలిగే శక్తి కావాలి. అదిలేకుండా కలం కాగితంమీద పెట్టడం దుర్లభం, అది దుస్సాహాసం అవుతుంది. కేవలం మనం దేనినీ ఊహించి సృష్టించలేము. అస్థిపంజరం లేకుండా శరీరాన్నీ ఊహించుకోలేము అలాగే ఆత్మలేకుండా మానవుడే ఉండడు,’’ అన్నాను. ‘‘కవిత్వం చేతకాదంటూ కవిత్వం మీద ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చారు,’’ సుశీ ఈ మాటలు అంటూంటే ఒక పెద్ద కెరటం వచ్చి మా ముందర విరుచుకుపడింది. తరువాత భయపడుతూ, భయపడుతూ బుల్లి బుల్లి కెరటాలు సుశీ పాదాలను ముద్దుపెట్టుకున్నాయి. ‘‘సుశీ! నాకు ఈ సముద్రాన్నీ, ఈ నురుగనీ చూస్తుంటే టాగూర్ రాసినది జ్ఞాపకం వస్తూంది. సముద్రతీరం సముద్రాన్ని అడిగిందట ... ‘నీ కెరటాలు నిరంతరం చెప్పడానికి ప్రయత్నిస్తున్నదేమిటో రాసి చూపించు.’ సముద్రం నురుగుతో పదే పదే చెప్పదలచుకున్నది రాసి, నిరాశా నిస్పృహలతో ఆ అక్షరాలను చెరిపివేసిందట’…అంటే దాని అర్థం ఆగమనంలోనే పురోగమనం ఇమిడి ఉందని కదా! సముద్రంలాగే మానవుడికి కూడా అందని అంతస్తులో అర్రులు చాచే ఆభరణం ఒకటుంటుంది. దానిని అందుకునే ప్రయత్నంలోనే చెయ్యి జారిపోయే విధానం కూడా ఇమిడి ఉంటుందని కదా?’’ అన్నాను. ‘‘అయివుండవచ్చు. అవును నువ్వు చెప్పిందే నిజం కావచ్చు. తప్పు సముద్రానిది కాదని తెలుస్తూనే ఉంది. అయితే ఇంకెవరిది? దానినిసృష్టించినవారిదే కదా? వారెవ్వరు? నిన్ను, నన్నూ సృష్టించిన వారే కదా?’’ అంది. అప్పుడు నా ఆశ్చర్యానికి మేరలేదు, సుశీ ఎందుకీవాళ ఇలాఉంది. ఎన్నోసార్లు నేను ఇలా మాట్లాడుతూవుంటే మందలించేది. రాబోయే దానిని రహస్యంగా ఆమె అంతరంగం గుర్తించగలిగిందా? అయితే రాబోయేదేమిటి? ‘‘అదిసరే, ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం మనము, ’’ అంది. ‘‘అది నాలుగు సంవత్సరాల తర్వాత సంగతి కదా , అప్పుడు మనమెలా ఉంటామో, ఎక్కడ ఉంటామో ఎవరికి తెలుసు,’’ అన్నాను మాట తప్పించుకుందామని. సుశీ మనస్సుని ప్రాపంచక విషయాల మీద మరలించడానికి అడిగిన ప్రశ్న అది. అయినా అది కూడా సరైన ప్రశ్న కాదు. ‘‘మీ కేమీ ఆ భయం అక్కర్లేదు, అప్పటికి నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడే ఉంటావు,’’ అంది. ఈ మాటలు పరధ్యానంగా అన్నట్టు కనబడింది. మనస్సు ఎక్కడో విహరిస్తున్నట్టుంది. ‘‘ఏమో సుశీ. జరగబోయే దానిని గురించి ఎవరికి తెలుసు?’’ అన్నాను. ‘‘అంటే నీ ఉద్దేశం ఏమిటి రామం? అంత నిగూఢంగా ఎందుకు మాట్లాడుతున్నావు?’’ అంది. ‘‘నిగూఢంకాదు సుశీ. గమ్యస్థానం తెలియని గుడ్డివాడిని చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు తీసుకువెళ్లాలి కదా? ఆశయంలేని వారికి అసహాయత విషం లాంటిది,’’ అన్నాను. ‘‘గమ్యస్థానం నీకేకాదు ఎవరికీ తెలియదు. నువ్వేమీ గుడ్డివాడివి కాదు. అయినా నా చెయ్యి మీకు ఎప్పుడూ లభిస్తుంది, అనవసరంగా భవిష్యత్తును గురించి ఆలోచించకు రామం. దాని వలన కలిగే లాభమేమిలేదు. మన ఇద్దరి జీవితాలు ఒకే పంథాతో నడుస్తాయి, ఆ భారం నేను వహిస్తాను,’’ అంది. ఇక్కడ కాస్త ఒక విషయం విశదీకరించాలేమో! సుశీ నన్ను అప్పుడప్పుడు ‘మీరు’ అని సంబోధించేది; అప్పుడప్పుడు అలవాటు ప్రకారం ‘నువ్వు’ అనేది, ఈ విధం తెలుగు భాషలోనే స్పష్ఠంగా కనబడుతుంది. ఇంగ్లీషులో ఈ రెండింటికీ తేడా ఏమీలేదు. ‘‘యూ’’ అనే పదానికి రెండు అర్ధాలు వస్తాయి. ఏదయితేనేం ఒక సారి ‘ఎందుకు సుశీ ఈ బాధ? అలవాటు ప్రకారమే ‘నువ్వు’ అని పిలవకూడ దూ,’ అన్నాను. సుశీ ‘‘ఇప్పటినుంచీ అలవాటు చేసుకోకపోతే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అందరి ఎదుట చిన్నతనంగా ఉండదా?’’ అంది. ‘‘స్త్రీలకు పురుషులతో సమానహక్కులు కావాలని ఇంటికప్పు లెక్కి అరచే వనితలలో ఒక దానివి కదా నువ్వు? మొన్న దాని మీద ఒక చిన్న ఉపన్యాసం కూడా యిచ్చావు. అందులో టాగూర్ నాటకం చిత్రాంగదలో చిత్ర చెప్పిన మాటలు ఉదహరించావు. ‘నేను చిత్రని. పూజ చేసే దేవతను కాదు. అడుగులొత్తే దాసీనికాను. నీ సర్వస్వంలోనూ నాకు సమభాగం కావాలి’ అంటూ చెప్పావు. అలాంటప్పుడు భార్య భర్తని మీరు అని ఎందుకు పిలవాలి? భార్యని భర్త ఎందుకు అలా సంబోధించకూడదు,’’ అన్నాను. ‘‘అవును అదీ నిజమే. కాని మనం సమాజంలో కొన్ని కొన్ని నియమాలకు బద్ధులమయి ఉండాలి. అంటే నా ఉద్దేశం అన్నింటికి తల ఒగ్గమని కాదు. ఆత్మ గౌరవాన్ని అణగతొక్కే వాటిని ప్రతిఘటించాలి. కానీ అందువలన కలిగే నష్టమేమీ లేదు. మీరు నాకంటే ఆరు నెలలు పెద్ద వారు. ఎలాగైనా పెద్దవారిని గౌరవించాలి కదా!’’ అంది. ‘‘నీకంటే ఆరు నెలలు చిన్నవాడినైతే ఏం చేద్దువు సుశీ?’’ అన్నాను. ‘‘చెయ్యడానికేముంది? అదే విధంగానూ అడ్డురాదు మన దారికి,’’ అంది. ‘‘కాని మన సమాజం అది ఒప్పుకోదు కదా! ఇది తల ఒగ్గవలసిన కట్టుబాటు కాదా?’’ అన్నాను. ‘‘కాదు. భార్యకన్నా భర్త ఒక మెట్టు పైన ఉండాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు పెట్టిన నియమం ఇది. ఈనాడు ఇది అర్థంలేనిది,’’ అంది. ‘‘అలా అయితే నన్నునువ్వు అని పిలిచేదానివా?’’ అన్నాను. ‘‘అవును. అల్లరిచేస్తే చెవులుకూడా మెలివేసేదానిని,’’ అంది నవ్వుతూ. ‘‘మన ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది సుశీ?’’ అన్నాను. ‘‘ఇంకెవరిది? నాదే, నేనే కాదు..మీరు ఎవరిని కట్టుకున్నా ఆమెదే అవుతుంది. మీ స్వభావమే అంత,’’ అంది ధీమాగా . ఆమె మాటలు నాకేమంత కష్టం కలిగించలేదు. ఆమె చెప్పినదే నిజమనిపించింది. తల్లిదండ్రులకి ఏకైక పుత్రుడిని అవటం వల్ల వచ్చిన నష్టమిది. సుశీ నామీద అనవసరమైన అధికారం చెలాయిస్తుందనే భయం నాకు కలుగలేదు, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుందనే విశ్వాసం నాకు. ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడూ నామాట చెల్లేది. మా ఇద్దరి మధ్య ఆనాడు ఉన్న సంబంధం ఈనాడు నాకు ఎంతో విచిత్రంగా కనబడుతుంది. భూతకాలాన్ని వర్తమానపు దీపంతో పరీక్షిస్తూంటే ఎప్పుడూ మేము ప్రేమ వాక్యాలు చెప్పుకునేవాళ్లం కాదు. వాటి అవసరం ఎప్పుడూ కలగలేదు. ఒకరి హృదయం ఇంకొకరికిస్పష్టంగా తెలుసు. అక్షర శబ్దాలని మించిన అనురాగం అది. సుశీ అప్పుడప్పుడు ఆమె చెప్పదలచుకొన్నది నేత్రాలతో వ్యక్తం చేసేది. ఎప్పుడైనా నేను కాలేజికి వెళ్లకపోతే ఆ సాయంత్రం నారూముకి వచ్చేది. తలుపు తోసుకొని రూములోకి వస్తూన్నప్పుడు ఆమె కళ్లు చూస్తే అప్పుడు నాకు వాటిలో ఆమె హృదయమంతా అద్దంలోని ప్రతిబింబములా కనపడేది. ‘క్లాసులో ఈవేళ ఏం చేప్పారు?’ అని అడిగితే, నవ్వుతూ ఏమో నాలుగు మాటలు చెప్పేది. ఇంక నేనేమి అడిగేవాడిని కాను, పాఠాలు వినలేదని స్పష్టంగా తెలిసిపోయేది. ‘‘హోటలు భోజనం నీకు పడటంలేనట్టుంది,’’ అంది ఒక సారి, ‘‘నీకు హాస్టలు భోజనం పడుతోందా?’’ అన్నాను. ‘‘ఎందుకు పడటంలేదు, నేను నిక్షేపంలా ఉన్నాను,’’ అంది. సుశీ ఏమీ నిక్షేపంలా వుండేది కాదు, పేలగా, పల్చగా, బలహీనంగా కనపడేది. చాలాకాలం అది ఆమె శరీర తత్వమే అనుకునేవాడిని. కాని చిన్నతనంలో ఎంత బొద్దుగావుండేదో జ్ఞాపకం వచ్చి అప్పుడప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. అయినా ఆ మార్పుని యవ్వనానికి అంటగట్టేవాడిని, ఇలా ఉంటేనే అందంగా ఉంది కదా? అలాంటప్పుడు ఎందుకు విచారించాలి? క్లాసులో నవ్వుతూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ ఉంటే ఎంత కొంటెగా, ఎంత మనోహరంగా ఉంటుంది? ఒకసారి మా ఇంగ్లీషు మాస్టారు అది కనిపెట్టి వేశారు. అయినా ఆయన పిల్లలున్నవాడు, ఇలాంటి అనుభవాలున్న తండ్రి, అందుకు ఊరుకున్నాడు. సుశీ ఈ సుఖం క్షణికమూ, శాశ్వతమూ అని నాలో నేను అప్పుడప్పుడు తర్కించుకుంటూండేవాడిని. వేసవి సెలవలకి ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకొన్నాము. ఇంటివద్ద నుంచి మా నాన్న గారు గట్టిగా ఉత్తరం రాశారు. మేమిద్దరం దసరాకు, సంక్రాంతికి కూడా ఇంటికి పోలేదు. ఇక తప్పదనుకుని సుశీ మద్రాసుకు, నేను రాజమండ్రికి బయలుదేరాము. నేను కనీసం వారానికొకసారైనా ఉత్తరం రాస్తానని వాగ్దానం చేశాను. వెళ్లేముందు రెండు నెలలబట్టి సుశీ ఆరోగ్యం సరిగా ఉండేదికాదు. ఏదో నీరసంగా ఉండేది. ఏమిటంటే ఏమీ లేదు వేసవికాలం అనేది. నేను రాజమండ్రి వచ్చి ఒక పక్షంరోజులయి ఉంటుంది. ఏమీతోచేదికాదు. ఎప్పుడూ సుశీ జ్ఞప్తికి వచ్చేద

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.